Tuesday 23 April 2024

 




ఒకనాడొక చర్చలో 'జీవితం అంటే ఏమిటి?' అన్న విషయం మొదలైంది.


అక్కడున్న వాళ్ళందరూ రకరకాలుగా వారికి తోచిన విధంగా చెప్పారు.


నేనన్నాను - 'జీవితం ఒక జ్ఞాపకం. అంతే' అని.


అదేంటన్నారు.


ఇలా చెప్పాను.


'జీవితంలో చివరికి మిగిలేవి జ్ఞాపకాలే. ఇక్కడ ఏదీ నీతో రాదు. నీతో వచ్చేది నీ జ్ఞాపకాలే. జీవిత చరమాంకంలో వెనక్కు తిరిగి చూచుకున్నప్పుడే ఈ విషయం అర్ధమౌతుంది. అంతకు ముందు అర్ధం కాదు. ఇంకా చెప్పాలంటే, జీవితం మొదట్లోనే జీవిత చరమాంకాన్ని రుచి చూచినవాడికే ఇది బాగా అర్ధమౌతుంది.


జీవితంలో నువ్వు పొందిన సంతోషాలూ, బాధలూ, ఆశలూ, నిరాశలూ, పొంగిపోవడాలూ క్రుంగిపోవడాలూ - అవన్నీ ఇప్పుడేవి? ఎక్కడున్నాయి?


నీ జ్ఞాపకాలుగా మిగిలి ఉన్నాయి. అంతే !


జీవితమంటే వర్తమానమే అని, వర్తమానంలో జీవించమని కొందరు తాత్వికులంటారు. నేను వాళ్ళను చూచి నవ్వుతాను. జీవితం వర్తమానం కాదు. అదొక జ్ఞాపకం. వర్తమానం కూడా జ్ఞాపకం అయినప్పుడే నీకు గుర్తుంటుంది. లేకుంటే దాన్ని నువ్వు గుర్తించలేవు.


నీ జీవితంలో నువ్వు ప్రేమించినవాళ్ళూ, నిన్ను ప్రేమించినవాళ్ళూ, నువ్వు ద్వేషించినవాళ్ళూ, నిన్ను ద్వేషించినవాళ్ళూ, నువ్వు కావాలనుకున్న వాళ్ళూ, నిన్ను కావాలనుకున్నవాళ్ళూ - వాళ్ళంతా ఏరి? ఇప్పుడెక్కడున్నారు?


నీ జ్ఞాపకాలలో ఉన్నారు. నీ జ్ఞాపకాలుగా మిగిలి ఉన్నారు.


నీ జీవితం మొత్తం ఇంతే. అది ఒక జ్ఞాపకం ! ఒక జ్ఞాపకంగానే అది చివరకు మిగులుతుంది.


గత జన్మలైనా అంతే. అవి జ్ఞాపకాలుగా నీ సుప్తచేతన అడుగున ఉన్నాయి. ఆ లోతులకు వెళ్లి చూడగలిగితే నీకు కనిపిస్తాయి. అప్పుడు నీ గత జన్మలలో నువ్వేంటో అర్ధమౌతుంది. ఈ జన్మలో నువ్వేంటో, అసలు నువ్వెంతో అర్ధమౌతుంది.  నువ్వెవరో అర్ధమౌతుంది.


'ఏమంటారు?' అన్నాను.


వాళ్ళందరూ ఏమీ అనలేదు. మౌనంగా ఉన్నారు.


ఏదైనా అనడానికి వాళ్ళంటూ అసలుంటే కదా? వాళ్ళంతా నేనే. వాళ్ళు నావాళ్ళే. నాలోని వాళ్ళే. నా జ్ఞాపకాలే.


జీవితమంటే ఒక జ్ఞాపకమే.


కాదా?


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏




 Jai Sri Ram 🙏


ఒక ఊరిలో ఎవరో రామాయణ ప్రవచనం చెప్తున్నారు.


ఒక బండోడు శ్రద్ధగా విని అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు.


"రామాయణం నీకేం అర్ధమైంది?" అని అడిగింది భార్య....

"నాకేం అర్ధం కాలేదు" అన్నాడు బండోడు .


ప్రవచనం జరిగిన

పది రోజులూ ఇదే తంతు.


ప్రవచనం నుండి రాగానే నీకేమర్ధమయింది అని భార్య అడగడం, నాకేం అర్ధం కాలేదని బండోడు చెప్పడం. భార్యకి కోపం నషాళానికి అంటింది.


ఇదిగో ఆ గుండ్రాయి తీసుకు పోయి దాన్తో నీళ్ళు పట్రా అంది.

బండోడు వెళ్ళి గుండ్రాయిని నీళ్ళల్లో ముంచాడు. గుండ్రాయిలో నీళ్ళు నిలబడవు కదా అలాగే తీసు కొచ్చాడు... భార్య మళ్ళీ తెమ్మంది.... మళ్ళీ వెళ్ళాడు.... అలా పది సార్లు తిప్పింది.


చూసావా......ఆ గుండ్రాయితో నీళ్ళు తేలేక పోయావు..... అలాగే పది రోజులు రామాయణం విన్నా నీకు ఏమీ అర్ధం కాలేదు.

"నువ్వా గుండ్రాయితో సమానం" అని ఈసడించింది.


అప్పుడు బండోడు అన్నాడు.

"గుండ్రాయి నీళ్ళు తేలేక పోయిన మాట నిజమే కానీ పదిసార్లు నీళ్ళల్లో మునగడం వల్ల మాలిన్యం అంతా

పోయి అది శుభ్రపడింది కదా.....అలాగే రామాయణం నాకేమీ అర్ధం కాకపోయినా పది రోజుల్నుండీ వినడం వల్ల మనసు తేలిక పడ్డట్టు హాయిగా వుంది. మనసు ప్రశాంతంగా వుంది" అన్నాడు.


భర్తకి అర్ధం కావల్సిన దాని కన్నా ఎక్కువే అర్ధం అయిందని భార్యకి అర్ధం అయింది !


నవ విధ భక్తి మార్గాల్లో శ్రవణం ఒకటి...విన్నా చాలు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

 




“స్పృహ”


తెలుగు కథాకన్యకకి కొత్తకొత్త సొగసులద్ది, ముస్తాబు చేసి, సర్వాలంకార భూషితని చేయడంలో ఎందరో కథకులు తమ కలాలను కలిపేరు. అందరూ కలిసి తమతమ కథా ప్రసూనాలతో అందంగా తీర్చిదిద్ది, ముచ్చటగా మన ముంగిట్లో కూర్చోబెట్టారు. ” సాహిత్యంలో ఏ ప్రక్రియా చేయలేని సేవ కథ చేసింది” అని ప్రముఖ రచయిత గోపీచంద్ గారన్న మాట ఇక్కడ ఓసారి తలచుకోవాలి.


1962 లో ప్రారంభించి, పదికి పైగా కథా సంపుటాలు వెలువరించి, ఇప్పటికీ ఇంకా అదే జోరుతో కథలు రాయడంలో వీర విహారం చేస్తూన్న వారు–ప్రసిద్ధ కథా రచయిత ‘ విహారి‘ గారు. వాసిలోనూ రాశిలోనూ కూడా వారు పేరెన్నిక గన్నవారు.


విహారి గారి అసలు పేరు జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి. ‘అక్షరం‘ ‘ గుండెలో కోయిల‘ ‘గోరంత దీపం‘ ‘ బొంగరం‘ ‘స్పృహ‘ మొదలైన కథా సంపుటాలు వీరు వెలువరించారు. కథలో క్లుప్తత చాలా ముఖ్యమని వీరి భావన.


ఇప్పుడు విహారి గారు రాసిన “స్పృహ” అనే కథ చదువుదాం.


👇👇👇👇👇👇


విశ్వానిది ఒక విచిత్రమైన జీవితం. అన్నీ అందినట్టే అంది జారిపోతున్నట్టుగా ఉంటాయి. ” క్షణక్షణం జీవితం నాతో దోబూచులాడుకుంటుంది. అడుగడుక్కీ దాన్ని పట్టుకుందామనుకుంటే

— అది నన్ను మొట్టి పరిగెత్తుకు పోతుంది” అని అనుకుంటూంటాడు. సినిమా టికెట్ల క్యూలో నించుంటే సరిగ్గా అతని దగ్గరకొచ్చేసరికి కౌంటర్ క్లోజ్ అయిపోతుంది.పేకాటలో కూచుంటే పన్నెండు ముక్కలే పండుతాయి కానీ, ఎంతకీ ఎక్స్ టెన్షన్ అంది చావదు. పుట్టినప్పటినుంచీ అంతే! అతని తల్లి రూపమే అతనికి తెలీదు. అసలు పుట్టడమే ఏదో కొంప మునిగిపోయినట్టు ఏడో నెల్లోనే తల్లి ప్రాణం తీసి మరీ ఈ లోకంలోకి తన్నుకొచ్చాడు. అన్నింటిలోనూ ‘తరుగు’… ఎప్పుడూ ఏదో వెలితి. ” అసలు నీ తరుగంతా నీ కుడికాల్లోనే ఉంది.” అని అతని ఎడమ కాలు కంటే అరంగుళం కురచైన కుడికాలు గురించి అతని మిత్రుడు సత్యం అంటూండే వాడు.

విశ్వం ఎస్. ఎస్. ఎల్. సి. లో ఒక్క మార్కులో స్కూల్ ఫస్టు పోగొట్టుకున్నాడు. దాంతో, స్కూల్ ఫస్టు వచ్చిన వాళ్ల పేర్లు రాసి, ఏళ్ల తరబడి వెళ్ళాడదీసే బోర్డు మీద తన పేరు బదులు రమాకాంత్ పేరు రాశారు. ఇతను కుళ్ళి కుళ్ళి ఏడిచాడు. అలాగే బి. ఏ లో 600 కీ 359 మార్కులు ఇచ్చి, (సరిగ్గా ఒక్క మార్కు తక్కువ–ఫస్టు క్లాస్ కి.) ఫస్టు క్లాసు అన్నావంటే తంతామన్నట్టుగా హెచ్చరించారు. ఓ మంచి కంపెనీలో ఉద్యోగం కోసం పరీక్ష రాసి, ఇంటర్వ్యూలో నెగ్గి, 21వ స్థానంలో నిలిచాడు. 20 మంది వరకూ తీసుకుని. లిస్టు ముగించారు! కాకపోతే ఒక్కటి మాత్రం జరిగింది. అతను గుమాస్తా ఉద్యోగానికి, టైపిస్ట్ ఉద్యోగానికీ కలిపి ఉన్న పరీక్ష (కంబైన్డ్ ఎగ్జామ్) రాస్తే, టైపిస్టుగా సెలెక్ట్ చేసి, అతని పేరుని వెయిటింగ్ లిస్టులో ఉంచారు. ఉద్యోగంలో చేరాల్సిన వాళ్ళలో ఒకతను హఠాత్తుగా పాము కరిచి పోయాట్ట.. దాంతో విశ్వానికి వచ్చిందా ఉద్యోగం! అతన్ని అభినందిస్తూ, “తరుగులో మెరుగంటే ఇదే!” అన్నాడు సత్యం. “ఇకనుంచీ నీ జాతకం మారుతుంది చూసుకో….” అని కూడా అన్నాడు.పాపం సత్యం ఆశాజీవి ! తీరా ఆఫీసులోకెళ్తే, అందరికీ గాద్రెజ్ టేబుళ్ళూ, కుర్చీలు.., విశ్వానికి మాత్రం ఇక్ష్వాకుల కాలంనాటి చెక్కకుర్చీ,టేబులూ, పాత ‘అండర్ వుడ్ ‘ టైపు రైటరూను. అందర్లోకీ జూనియర్ కనక అతనికంతేనట. ఇలా ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు ఏదో వెలితి.

విశ్వానికి నలుగురు మావయ్యలు. చిన్నప్పటి నుంచీ పెద్ద మావయ్యే పెంచాడు. ఆయన మూడో కూతురు సావిత్రి అంటే ఇతనికి ఇష్టం. ఆమెను పెళ్ళి చేసుకోవాలనే కోరికుండేది. కాని పెద్ద మావయ్య ఒక డాక్టర్ సంబంధం ఆమెకు ఖాయం చేశాడు. దాంతో ఇతగాడు తన కోరికని నొక్కి పెట్టేశాడు. అంతే కాదు ఆ మావయ్య నాలుగో కూతురు రమని చేసుకోమన్నాడు. విశ్వం తలూపకపోయినా, పెళ్ళి జరిగిపోయింది. కాపురం పెట్టేకా అతను సాయంత్రాలు షికారుకి వెళ్దామంటే, రమ తను హిందీ పరీక్షలకి చదువుకుంటాననేది. మొత్తానికి ఆమె కష్టపడి ప్రవీణ ప్యాసయ్యింది. మునిసిపాలిటీ వారి స్కూల్లో ఉద్యోగానికి దరఖాస్తు పెట్టింది. విశ్వం కొంత అప్పుచేసి అంతో ఇంతో ముడుపు చెల్లించుకున్నాడు. తీరా చివరి క్షణంలో ఒక పోస్ట్ తగ్గించవలసి వచ్చి ‘ఈమెకు ఇవ్వడం కుదరలేదు.. వచ్చేసారి తప్పకుండా చేస్తా’మన్నారు.

తొలి చూలు మగపిల్లవాడైతే త్వరగా చేతికి అంది వస్తాడు కదా అనుకున్నాడు. ఆడపిల్ల పుట్టింది. టైపిస్టు నుంచి గుమాస్తాగా మార్పు వచ్చి అతన్ని హైదరాబాద్ బదిలీ చేశారు. అయినా అతనికి జీవితంలో పెద్ద మార్పు రాలేదు. ఎప్పుడైనా పాలబూత్ కి రమ వెళ్లకుండా అతను వెళ్తే, ఆరోజు పాలు లేనట్టే. అతని వంతు వచ్చేసరికి ‘ క్యాన్ ‘ ఖాళీ అయ్యేది. చివరికి కూతురి పుట్టు వెంట్రుకలు తీయించడానికి తిరుపతి వెళ్తే ,అక్కడ కూడా సత్రం గదులకీ , దర్శనానికీ ఆఖరి క్షణం వరకూ ఏదో సమస్యే. అలా జీవితం ఏదో ‘తరుగు’ తోనే జరిగిపోతోంది.

ఇలా ఉండగా ఒకరోజు అతని పెద్దమామయ్యకి ఆరోగ్యం బాగోలేదని, ఆసుపత్రిలో చేర్చారని వార్త వచ్చింది. రమ కన్నీళ్లు పెట్టుకుంది. విశ్వం ఆఫీసుకెళ్ళి, మేనేజర్ని సెలవు కావాలని అడిగితే,

ఆఫీసరు ఇతని సెలవు చీటీ పక్కన పెట్టి,ఓ టెలిగ్రాం చూపించాడు– ఆ మర్నాటి నుంచి ‘స్పెషల్ ఆడిట్ ‘ ఉందని. కనక సెలవు ఇవ్వలేదు. రమ కూతుర్ని తీసుకుని బందరు వెళ్లిపోయింది. బందరు నుంచి రమ టెలిగ్రాం ఇచ్చింది– ఆమె తండ్రికి చాలా సీరియస్ గా ఉందనీ, వెంటనే రమ్మనీ. విశ్వం ఏదో బస్ పట్టుకుని మర్నాటి ప్రొద్దుటకి అతి కష్టం మీద విజయవాడ చేరేడు. మంచి వేసవికాలం. ఆరోజు పెళ్లి ముహూర్తాలు చాలా ఉన్నాయిట. బస్ స్టాండులో నిలబడడానికి కూడా ఖాళీ లేదు. బస్సులేవీ సమయానికి నడవడం లేదు సరికదా..వచ్చిన బస్సుల్లో దూరడం అతని వల్ల కావడం లేదు. ఎలాగోలాగ ఎప్పటికో ఎవడో వెనకనుంచి గెంటితే బస్సులో పడి అతను బందరు వెళ్లేసరికి అక్కడ అంతా అయిపోయింది. తండ్రిలా పెంచిన మామయ్యని కడసారి చూసుకోలేదనే అతని బాధ కంటే, బంధువుల సూటి పోటి మాటలు అతన్ని ఎక్కువ బాధించాయి. అతని దురవస్థని సత్యం ఒక్కడే నమ్మేడు.” నువ్వు ఎక్కవలసిన రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు” అన్న కవి వాక్కు నీ పట్ల అక్షరాలా అన్వయిస్తుంది ” అన్నాడు.

కాలం గడిచిపోతోంది. నెలలు సంవత్సరాలుగా మారుతున్నాయి. విశ్వానికి ఇంకో ముగ్గురు అమ్మాయిలు పుట్టేరు. యథాప్రకారం అతను అడుగు ముందుకు వేస్తే ఆరడుగులు వెనక్కి లాగుతూనే ఉంది జీవితం. అతనిని విశాఖపట్నం బదిలీ చేశారు. విశాఖలో విశ్వానికి తన ఆఫీసులో సెక్షన్ హెడ్ రెడ్డి గారితో మంచి పరిచయం ఏర్పడింది. చాలా సాన్నిహిత్యం పెరిగింది. ఆయన్ని ‘గురువుగారూ’ అనేవాడు. ఆయనా ఇతన్ని అభిమానంతో చూసేవాడు.

ఆరోజు ప్రమోషన్ ఫలితాలు తెలిశాయి. విశ్వానికి మళ్ళీ ప్రమోషన్ తప్పిపోయింది. అది ఆరోసారి! అతని బాధ వర్ణనాతీతం..తన చవటతనం మరోసారి నలుగురికీ తెలిసిందనే ఆవేదన. సహోద్యోగుల సానుభూతి మరీ ఇబ్బందిగా ఉంది. మధ్యాహ్నం లంచ్ టైమ్ అయ్యాకా రెడ్డిగారు అతని దగ్గరకొచ్చారు. ” ఈ పూట సెలవు పెట్టాను. విశ్వం! నువ్వూ రా, బయటికి పోదాం. మీ వాళ్ళు లేరన్నావు కదూ..”అన్నారు. “అవును., ఇవ్వాళే వస్తారు..రాత్రి ఎనిమిది గంటల రైల్లో ” అన్నాడు విశ్వం. రెడ్డిగారి స్కూటర్ ఓ సినిమాహాలు దగ్గర ఆగింది. “గ్రేట్ ఎస్కేప్ ” ఇంగ్లీష్ సినిమా. జనం పలచగా ఉన్నారు. ఓ మూల కూచున్నారు. కాసేపయ్యాకా రెడ్డిగారు ” సినిమా అయ్యాకా మా ఇంటికి పోదాం. అక్కడినుంచి నిన్ను స్టేషనులో దించుతాను. మాఇంటికి నువ్వెప్పుడూ రాలేదు కూడా.”అన్నారు. విశ్వం మౌనంగా అంగీకరించాడు.సినిమా నడుస్తోంది. రెడ్డిగారే మళ్ళీ అన్నారు, “నాగురించి నీతో చెప్పాలని చాలా సార్లు అనుకున్నాను. కానీ వీలు కాలేదు.” విశ్వం అయనకేసి చూశాడు. ఆయన హలు సీలింగ్ కేసి చూస్తూ,” నేను నోట్లో వెండి చెంచాతో పుట్టినవాణ్ణి. మా నాన్న కలప వ్యాపారం చేసేవాడు. నా అయిదో ఏట నన్ను బళ్ళోవేసిన రోజున మావాళ్ళు బ్యాండ్ మేళంతో కార్లో ఊరేగించి, పిల్లలందరికీ పలకా, బలపం, లడ్డూలతో పాటు తలో రూపాయీ ఇచ్చేరట. అయ్యవార్లందరికీ పట్టు పంచలు పెట్టారట. ఆతరువాత ఏదో ఓ సినిమాలో జరిగినట్టు అంతా పోయింది. నేను వారాలు చేసుకుని ఎస్సెల్సీ పాసైనాను. అయ్యాకా, మద్రాసులో ఒక కంపెనీలో నెలకి పదహారు రూపాయల జీతంతో ఉద్యోగం వచ్చింది. పెళ్ళీ పేరంటాలూ అయ్యాయి. ఒక అమ్మాయీ, ఒక అబ్బాయీ పుట్టేరు. మా ఆఫీసు నాలుగంతస్తుల భవనంలో కింద ఫ్లోర్ లో ఉండేది. ఒకరోజు ఉన్నట్టుండి ఆ భవనం మొత్తం కూలిపోయింది. వందల సంఖ్యలో జనం చచ్చిపోయారు. నేను ఎనభైనాలుగు రోజులు ఆసుపత్రిలో ఉన్నాను. శరీరంలో చాలా ఎముకలు గన్నేరు కొమ్మల్లా విరిగిపోతే అతుకు పెట్టారుట. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈ కంపెనీలో చేరి వేరే అవతారం ఎత్తాను.” రెడ్డిగారు చెప్పడం ముగించారు.విశ్వానికి గుండెలు చిక్కబట్టినట్టయింది. ఆశ్చర్యంగా– సమాధి నుంచి లేచి వచ్చిన శవాన్ని చూసినట్టు ఆయనకేసి చూశాడు.

కాసేపటికి సినిమా అయిపోయింది. అక్కణ్నుంచీ రెడ్డిగారింటికి చేరేరు. కాసేపు కూచున్నాకా, ” రా…ఇల్లు చూద్దువుగాని…” అని ఆయన విశ్వాన్ని లోపలికి తీసుకెళ్లారు. ఒక గదిలో మంచంలో పడుకునున్న ఒకామెను చూపించి,” నా శ్రీమతి” అన్నారు. “ఒంట్లో బాగాలేదా?” అడిగేడు విశ్వం. అదోలా నవ్వి, “ఆమెకి ఐదేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది..” అన్నారు. విస్తుపోయాడు విశ్వం. మరో గదిలోకి చూపించి..”మా అబ్బాయి ప్రభు” అన్నారు. అతను చేతులెత్తి నమస్కారం చేశాడు. బయటికొచ్చాకా చెప్పేరు…” వాడికి నోరూ లేదు., కాళ్లూ లేవు.”అని. విశ్వం మనసంతా కలిచినట్టయింది. గబగబా ముందు గదిలోకొచ్చేశాడు. రెడ్డిగారు కాఫీ కప్పులతో వచ్చారు. కాఫీ తాగుతూ చెప్పేరు. “మా అమ్మాయిని పుట్టింటికి రానివ్వరు..వాళ్ల అత్తగారు. దానికిద్దరు పిల్లలు. మా ఆవిడ దూరపు బంధువు ఓ ముసలమ్మ వండి పెడుతుంది. ఈ ఇంట్లో ఉన్న ఒకే ఒక్క మనిషి ఆవిడే.. మిగిలినవన్నీ జీవచ్ఛవాలు.!” విశ్వానికి దిమ్మ తిరిగిపోయింది.

కాసేపు పోయాకా ఇద్దరూ– విశ్వం భార్య రమనీ, పిల్లల్నీ రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్ కి వెళ్ళేరు. అప్పటికే స్టేషనంతా చాలా గందరగోళంగా ఉంది. ఆ రైలుకి ప్రమాదం జరిగిందనీ, చాలామందికి గాయాలయ్యాయనీ, కొందరు మరణించారనే వార్త అట్టుడికినట్టు ఉడికిపోతోంది. విశ్వానికి కాలూ చెయ్యీ ఆడటం లేదు. రెడ్డిగారు ధైర్యం చెపుతున్నారు. గబగబా బయటికి వచ్చి విశ్వం వాళ్ల ఊరికి టెలిగ్రాం ఇచ్చారు. భయాందోళనలతో, బరువెక్కిన గుండెలతో ఇంటికొచ్చారు. రాగానే ఇంటి వాళ్లబ్బాయి గుమ్మంలోనే ఎదురై ఓ టెలిగ్రాం అందించాడు. “రేపు వస్తున్నాం.., ఈ రోజు రైలు తప్పిపోయింది” –రమ. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు విశ్వం. “తరుగులో మెరుగు అంటే ఇదే..” వేరే సందర్భంలో సత్యం అన్న మాట గుర్తుకొచ్చింది అతనికి. “జీవితం నీకు ఎప్పుడు ఏది ఇస్తుందో దాన్ని స్వీకరించు. అది రాలేదని బాధపడీ, ఇది కావాలని ఆరాటపడీ మనంగా సాధించగలిగేది చాలా స్వల్పం! కాదంటావా?” రెడ్డిగారు అడుగుతున్నారు. కూలిపోతున్న నాలుగు అంతస్థుల భవనం, విరిగిపోతున్న గన్నేరు కొమ్మలే–విశ్వం కళ్ల ముందు మెదులుతున్నాయి. ఆయనకేసి చూశాడు. మహా పర్వతం ముందు గులక రాయిలా తనకి తాను కనిపించాడు.

——++——-



కథలో ఆఖరున రెడ్డిగారితో చెప్పించిన రెండు వాక్యాల ద్వారా రచయిత విహారి గారు జీవితాన్ని అద్భుతంగా నిర్వచించారు. అనుకున్నట్టుగానే ఎల్ల వేళలా జరగకపోగా, అనూహ్య సంఘటనలు

జరగడమే …జీవితమంటే. ఆశించడం (expectation) ఉన్నచోటే–ఆశాభంగమూ (disappointment) ఉంటుంది. నిత్యానుభవంలో అందరూ ఇలాంటివి చూస్తూనే ఉంటారు. 


క్షణంలో జారిపోయిన అవకాశాల్లాగే–తృటిలో తప్పిన ప్రమాదాలూ ఉంటాయి. దేనికీ కృంగి పోకూడదు…పొంగిపోకూడదు. ఈ తెలివి కలిగి ఉండడమే–జీవితానికి అర్థం గ్రహించడం అంటే!

అనే భావాన్ని సూచిస్తుంది ఈ “స్ప్రహ” అనే కథ.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Wednesday 10 April 2024

 ఏదో శాస్త్రానికి ఆ మాత్రం చాలు, ఫరవాలేదు


            ఈ మాటలు తరచూ మనం వినేవే. ఏదో ఒక సందర్భంలో రోజువారీ జీవితంలో మనం వినేవే. మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక వైదిక కార్యక్రమాలలో ఐతే ఒకసారి కన్నా ఎక్కువగా చాలా తఱచుగా, సునాయాసంగా ఏ సంకోచం లేకుండా విరివిగా వాడే మాటలు ఇవి. మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఈ మాటలు అడ్డంకి అనే చెప్పాలి, అతి దారుణమైనవి కూడా!


            తఱచుగా ఏదో వైదికి కార్యక్రమంలోనో, పూజల్లోనో, "అంతా అఖ్ఖర్లేదురా... శాస్త్రానికి ఏదో కొంచెం ఇలా చేసెయ్యండి, మిగిలింది ఫరవాలేదు తరవాత చూసుకోవచ్చు" అని చెప్పేవారే ఎక్కువ. తరవాత చూసుకోవడానికి ఏమీ ఉండదు, ఫరవాలేదు అని వదిలిపెట్టబడిన వైదిక కార్యక్రమం వల్ల మొత్తం కార్యం అసంపూర్ణమై వ్యతిరిక్త ఫలితాలు వచ్చినా, అసలు ఫలితాలు రాక ఇవ్వన్నీ వ్యర్థం అని ప్రచారం జరిగితే ఫరవాలేదని తరవాత చూసుకోవడానికి ఏమీ ఉండదు. మరి వాళ్ళు తెలిసి చెప్తారో లేక తెలియక చెప్తారో దేవుడికెఱుక.


            శాస్త్రంకోసం కొంచెం చెయ్యడమేమిటి? చేసినా ఫరవాలేదు అని అనడమేమిటి? అంటే శాస్త్రం చెప్పిన పద్ధతులు నియమాలు ఏదో మొక్కుబడిగా పాటించడమా?  శాస్త్రం కోసం కొంచెం సొంతంకోసం మొత్తమా? ఈ మాటలు వాడేవారు వేద విహితమైన ధర్మాలను శాస్త్ర ప్రామాణాలను పాటించవలసిన అవసరం అంతగాలేదు అని చెప్తున్నారా అన్న అనుమానం వస్తుంది, బహుశా వాళ్ళ ఉద్దేశ్యం కూడా అదేనేమో!. ఆమాట అన్నవాళ్ళని కూడా నిలదీసి సరిఐన శాస్త్ర ప్రమాణమేమిటో తెలుసుకొని ఆచరించవలసిన అవసరం నేడు చాలా ఉంది.

🙏🙏🙏🙏🙏🙏

 



దృష్టి కోణం


శ్రీ గురుభ్యోనమః


ఒక్కో మనిషి దృష్టి కోణం, వ్యక్త పరచిన భావాల వల్ల ఆవ్యక్తి ఏ స్థాయిలో ఉన్న వాడనేది పెద్దలు పసిగడుతుంటారు. ముఖ్యంగా గురువులు/ఆచార్యులు తమ శిష్యులను తమ దగ్గర ఉంచుకొని విద్య బోధించేటప్పుడు ఈ విషయాన్ని వారి శిష్యులకి తెలీకుండా పరీక్ష చేసి తగు విధంగా వారికి శిక్షణని ఇచ్చేవారు.


ఇది దేహ దృష్టి, మనో దృష్టి, ఆత్మ దృష్టి అని మూడు రకాలు. ఇందులో ముందు నుంచీ చూసినప్పుడు ఆత్మ దృష్టి అత్యుత్తమమైనదీ, దేహదృష్టి అథమము / కనిష్టమైనది.


ఒక వ్యక్తి అలా మన ముందు నుంచి వెళ్తుంటే అబ్బా భలే ఉన్నాడురా ఒడ్డూ, పొడుగూ, ఆ వంటి రంగూ, వేసుకున్న చక్కని బట్టలూ అని ఆనందించే వారుంటారు. వారికి ఆ దృష్టి ద్వారా, కట్టు బొట్టు, జుట్టు, బట్ట, కులం, రంగు, సౌందర్యం, ఇవి మాత్రమే వారి దృష్టికి అందుతాయి. ఉదాహరణకి ప్రవచనాలు వినడానికి వచ్చి ప్రవచనకర్త భౌతికాకారాన్ని చూసి పొగిడేవారు కొందరు. ఆయన ఏం చెప్పారు అన్నదాంతో సంబంధం ఉండదు. ఏం విన్నారో ప్రవచనం అయ్యాక గుర్తు ఉంటుందా అంటే అక్కడక్కడా వేంకటేశ్వర స్వామి పంచె లాగా అన్న మాట. వీరిది స్థూల/భౌతిక/దేహ దృష్టి. వీరి దృష్టి ఉన్నదాన్ని ఆస్వాదిస్తూనే ఏది లేదా అని వెతుకుతూ ఉంటారు.


ఇంకొకరు ఒక వ్యక్తిని చూస్తూనే ఈయన పండితుడిలాగా ఉన్నాడు అని తలచి ఆ వేపున కాస్త పరిశీలించి అబ్బా గొప్ప పండితుడు అని సర్టిఫికేట్లిస్తారు. చూసావా ఆ పంచె కట్టు ఆ వీబూధి బొట్టు, ఆ గడ్డంఅదీనూ బహుశా ఈయన కవేమో, లేదా ఉపాసకుడేమో అని వారికి వారే పరి పరివిధాలా పరిశీలించుకొని ఆ వ్యక్తిని ఏదో ఒక పాండిత్యానికి అంటగడతారు. ఇలా చెప్పే వారు బోలెడు మంది. అబ్బా ఏం గుర్తు పెట్టుకుంటారండీ అనో, భలే చెప్తారండీ అనో, అబ్బా పద్యాలు ఏం చెప్పారండీ అనో, అన్ని పురాణేతిహాసాలు అన్నీ ఆయనకి కంఠతా అనో, లా ఏదో ఒక సర్టిఫికేట్లిచ్చేవారుంటారు. వారు రెండవ కోవకి చెందినవారు. అలానే వీరూ అంతే అన్నీ బాగున్నాయంటూనే అదిగో చూసారా అక్కడ సరిగ్గా చెప్పలేదు అదీ ఇదీ అని లెక్కలు కడతారు.


ఇక అతి కొద్ది మంది ఉంటారు, ఆపక్కనుంచో ఆ వ్యక్తికి దగ్గరనుంచి అలా వెళుతుంటేనే అవతల వ్యక్తిలోని పరబ్రహ్మాన్ని చూసి నమస్కరిస్తారు. ఆ వ్యక్తిని చూడగానే అసంకల్పితంగా వారి రెండు చేతులూ ముకుళించుకుంటాయి. ముందు ఏదో ప్రణాళిక వేసుకుని వారిని కలిసి ఇలా నమస్కారం చేయాలి అవీ ఇవీ అని ప్రణాళిక చేయకపోయినా, వారిని చూడగానే వారిని తలచుకోగానే అప్రయత్నంగా రెండు చేతులూ ముకుళించుకుపోతాయి. మరో మాట ఉండదు, ప్రశ్నా ఉండదు, అక్కడ ఉండేది ఆనందం ఆత్మానందం. ఆ ఆత్మ దృష్టి అలవడాలనే ప్రతి ఒక్కరూ సాధన చేసేది.


ఓ చిన్న కథ


జనక మహారాజు గారు విదేహ వంశస్థులు, గొప్ప ఆధ్యాత్మిక జిజ్జాస కలిగి యాజ్ఞవల్కుని బ్రహ్మ విద్యా జ్ఞానమును పొందుటకుగానూ సుశిక్షితుడైనవాడు. ప్రజలకు ఎన్నో దాన ధర్మాలు చేసినవాడు. అటువంటి జనక మహారాజు, పండితులను, భాషాకోవిదులను, శాస్త్రకారులను, వివిధ అంశములందు ప్రావీణ్యము కలవారిని ఎందరినో పిలిచి సభలు జరిపేవాడు. ఒకనాడొక సభకు అష్టావక్రుడు అనే మహానుభావుని అతిథిగా ఆహ్వానించాడు. అతని గూర్చి, అతని తపస్సు గూర్చి, జ్ఞానమును గూర్చి సభలో అత్యధికులు అప్పటి వరకు విన్నవారే తప్ప ఆయనను చూసిన వారు లేరు.


ఆమహర్షి దర్శనానికి, ఆయన వేదాంత శాస్త్ర పాండిత్యాదులను వారి గొంతుతో వినడానికి పామరులు పండితులు ఎందరో ఆనాటి సభకి విచ్చేసారు. అందరూ ఆ మహర్షి రాకకై ఎదురుచూడసాగారు. ఈలోగా ప్రభువుకి తమ తమ పాండితీ ప్రకర్ష చూపే వారు కొందరు, తమ తమ ప్రతిభా పాటవాలు చూపేవారు కొందరు ఇలా సభ కిట కిటలాడుతున్నది. అష్టావక్ర మహర్షి శరీరం ఎనిమిది చోట్ల వంకరగా ఉంటుంది అందుకే ఆయన పేరు అష్టావక్రుడు అని పేరు కలిగింది. బహు తపస్వి, సత్య తత్త్వ విచారణ చేసి తెలుసుకోవలసినదానిని తెలుసుకొని స్వస్వరూప జ్ఞానమునెఱిగినవాడు. అతని ముఖము బ్రహ్మవర్చస్సుచే మరో అగ్నిహోత్రమా అన్నచందమును బ్రహ్మ వర్చస్సుచే వెలుగొందేది. అటువంటి మహర్షి సభా ప్రవేశం చేయుటకు సభలో ప్రవేశించారు. ఈలోగా కలకలం మొదలైంది. అందరూ గుసగుసలు ఈయన ఆకారం చూసి పండితలు, పామరులు అన్న తేడా లేకుండా అందరూ ఆయనని చూసి నవ్వడం మొదలెట్టారు. అది తెలిసి జనక మహారాజు అష్టావక్రులు వెళ్ళిపోకుండా వెనక్కి సభకి తీసుకురావాలని పరుగున వెళ్ళి గౌరవంతో తోడ్కొని వచ్చి ఉచితాసనం వేసి అర్ఘ్య పాద్యాదులిచ్చి ఉచిత సత్కారం చేసి నమస్కరించాడు. అప్పుడు అష్టావక్రుడు గట్టిగా నవ్వసాగాడు. జనక మహారాజు అయ్యా ఎందుకు నవ్వుతున్నారు, మిమ్మల్ని మీ దేహాన్ని చూసి ఇతరులు సభికులు ఇతః పూర్వం నవ్వారు మరి మీరెందుకు నవ్వుతున్నారో తెలియపరచండి అని కోరాడు.


అష్టావక్ర మహర్షి తన నవ్వుకి కారణం ఇలా వివరించారు " రాజు నన్ను పండిత సభకి ఆహ్వానించారు, కానీ ఇక్కడ ఒక్క పండితుడూ లేడేమి? సభ అంతా చర్మకారుల, మాంస విక్రేతలతో నిండి ఉంది. చర్మ కారుల సభతో నాకేమి పని అని వెనుదిరుగుతుంటే మీరు పిలిచి సింహాసనం లో కూర్చోపెట్టి అతిథి సత్కార్యాలు చేసారు. మీరు నన్నే సభకి పిలిచారో, ఇది ఆ సభ కాదు. పండితులు, ముని వర్యులు, మహర్షులు ఉండవలసిన సభలో మీరు నన్ను కూర్చోపెట్టి ఇలా ఆతిథ్యం ఇవ్వడం సబబే, కానీ ఈ చర్మకారులు, మాంస విక్రేతల సభలో ఉన్నతుడిగా కూర్చోబెట్టి సన్మానం చేస్తున్నారేమిటా అని నవ్వు వచ్చింది" అని అన్నారు. అంత రాజు అయ్యో అంత మాట ఎందుకన్నారు ఇక్కడున్న పండిత జనులందర్నీ మీరు చర్మకారులూ, మాంస విక్రేతలూ అని ఎందుకన్నారో సెలవీయండి పొరపాటు సవరించుకోగలరు అని అడుగగా, ఆ మహర్షి "వీరు జీవుల ఎడ సమభ్రాంతి ఉన్నవారు కాదు. నా శరీర సౌష్ఠవము చూసి బాగున్నదాలేదా అని తలచి ఎనిమిది వంకరలున్నవని కొలచి, నన్ను చూసి నవ్వుకున్నారు. ఆత్మను వదిలి చర్మము, మాంసమును చూసి దాని విలువ లెక్క కట్టేది చర్మ కారులు మాంస విక్రేతలే కదా అందుకే అలా అన్నాను." అది విని సభికులంతా ఆ మహా జ్ఞానిని చూసి సిగ్గుపడి తమ తప్పిదాన్ని మన్నించమని వేడుకున్నారు.


అష్టావక్ర మహర్షి యొక్క ఈ చిన్న కథ ఆత్మ దృష్టిని అలవర్చుకోవలసిన అవసరాన్ని, అలా అలవర్చుకోని వారి స్థితినీ తెలియజేస్తున్నది.



వ్యక్తి యొక్క ఒడ్డూ, పొడుగూ, సౌందర్యం, వయ్యారం, వస్త్రాడంబరం, వాగాడంబరం కాదు ప్రధానం. ఆత్మగుణ ప్రవృత్తి ఎంత స్వచ్ఛమైనదీ, మాటలచేతల పొంతన ఎంత స్పష్టమైనదీ అన్న విషయం ప్రధానం


ఇందుకే సుభాషితంలో చెప్తారు

అక్షరాణి పరీక్ష్యన్తామమ్బరాడమ్బరేణ కిమ్ !

శమ్భురమ్బరహీనోఽపి సర్వజ్ఞః కిం న జాయతే !


పట్టుపుట్టాలనీ, ఆకారాన్నీ ఏం పరీక్షిస్తావ్? విద్యను పరీక్షించు. దిగంబరుడైనంత శివుడు సర్వజ్ఞుడుకాడా?



సర్వం శ్రీ పరబ్రహ్మరాపణమస్తు


🙏🙏🙏🙏🙏🙏🙏🙏

 


నక్షత్ర పోరాటం

                  ===========

                       (కథానిక)


రచన ::

బుద్ధవరపు కామేశ్వరరావు

హైదరాబాద్


"ఏమండీ మన అమ్మాయి నక్షత్రకు చదువు రావడం లేదని సెకండ్ క్లాస్ చదువుతున్న ఆ మూన్ మూన్ స్కూల్ నుంచి మాన్పించి Star Super Masters స్కూల్లో వేద్దామనుకున్నాం కదా? వాళ్లు రేపు నన్ను ఇంటర్వ్యూ కి రమ్మన్నారు"

భర్త అర్జున్ కి చెప్పింది అంజు.


"నువ్వెందుకు? వెళ్లాల్సింది నక్షత్ర కదా?"


"ఇల్లాలును చూసి ఇల్లు చూడు అన్నట్టు తల్లి తెలివితేటలు చూసే పిల్లకు సీటు ఇస్తారుట"


"అంటే నక్షత్ర కోసం నీకు పోరాటం తప్పదన్న మాట. సరే పరీక్షకు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి వెళ్లు!"


     **     **     **     **


మర్నాడు ఉదయం నాలుగు అంతస్తుల భవనంలోని మొదటి అంతస్తుకి చేరుకుంది అంజు. అక్కడ మీటింగ్ హాల్ ముందు కాసేపు తచ్చాడి, నెమ్మదిగా తలుపు తీసింది.


"ప్లీజ్ కమిన్ మేడమ్. బయట వాచ్ మేన్ లేడా? సరే, సర్టిఫికెట్లు ఇస్తారా?" అనుమానంగా అడిగాడు కుర్చీలో కూర్చుని ఇంటర్వ్యూ చేస్తున్న  సొరకాయలా  ఉన్న ఓ వ్యక్తి.


"లేదు సార్. కన్ఫర్మ్ అవ్వగానే ఇస్తాను"


"అలాగే. ఇప్పుడు మూడు ప్రశ్నలు అడుగుతాను. సమాధానాలు చెప్పు. మొదటిది పొట్లకాయ ఎంత పొడుగు ఉంటుంది"


"ఐడియా లేదు సార్!'


"విత్తనాలతో వచ్చే ఆయిల్ ఏది?"


"తెలియదు సార్!"


"పిల్లలకు ఇష్టమైన బ్రాండ్?"


"జేమ్స్ బాండ్ సార్!"


"చూడమ్మా, ఒక్క సమాధానం కూడా సరిగ్గా చెప్పలేదు. ఇంక నువ్వు వెళ్లవచ్చు"


"సార్! మా పాప భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అయినా...." చెప్పబోతున్న అంజుతో, "వెళ్లవమ్మా, వెళ్లూ.." అంటూ డోర్ వైపు చూపించాడు సొరకాయ.


     **     **     **     **


తలుపు తీసుకుని బయటకు వచ్చిన అంజును చూసిన వాచ్ మేన్

"ఎవరమ్మా నువ్వు? లోపలికి ఎప్పుడు వెళ్లావ్?" అడిగాడు అనుమానంగా. 


"బాబూ! ఈ Star Super Masters స్కూల్లో మా అమ్మాయిని థర్డ్ క్లాసులో జాయిన్ చేయడానికి ఇంటర్వ్యూ ఉంటే వచ్చాను. కానీ లోపలాయన ఏదో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు" అసలు విషయం చెప్పింది అంజు.


"భలేదానివమ్మా నువ్వు. ఇది Star Super Masters స్కూల్ కాదు. ఇది Scar Super Market వాళ్ల ఆఫీసు. ఈరోజు ఇక్కడ సేల్స్ గర్ల్స్ కోసం ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఇంకా ఎవరూ రాలేదని అలా బీడీ కాల్చుకోవడానికి వెళ్లాను. నీ స్కూల్ పైన సెకండ్ ఫ్లోర్ లో ఉంది వెళ్లవమ్మా. ఇప్పుడు నన్ను ఏం పీకుతాడో?" అంటూ హడావుడిగా లోపలికి పరుగు తీసాడు వాచ్ మేన్.


    **     **     **     **


సెకండ్ ఫ్లోర్ కి వచ్చిన అంజు, అక్కడ చంద్రశేఖర్, కరస్పాండెంట్ అని బోర్డు ఉన్న గది వద్దకు చేరుకుంది. అక్కడ తనలాంటి వారు ఇంకా ఇద్దరు వేచి ఉండడం చూసి, ఈలోగా సొరకాయ గాడు అడిగిన వాటికి సమాధానాలు ఏమిటో చూద్దామని గూగులమ్మని సంప్రదించింది. కాసేపటికి లోపలినుంచి కబురు రావడంతో లోపలికి వెళ్లింది. సర్టిఫికెట్లు చూసిన చంద్రశేఖర్,


"చూడమ్మా! మూడు ప్రశ్నలు అడుగుతాను. సమాధానాలు చెప్పు. మొదటి ప్రశ్న భూమికి చంద్రునికి మధ్య దూరం ఎంత?"


"మూడు అడుగులు సార్!"


"రాకెట్ లో వాడే ఇందనం?"


"సన్ ఫ్లవర్ ఆయిల్"


"టిట్ ఫర్ టాట్ అంటే ఏమిటి?"


"కిట్ కేట్ సార్!"


"చూడమ్మా.అంజూ! నీ బుర్రలో గుంజు తక్కువని తెలిసింది. అసలు నేనడిగిన ప్రశ్నలు ఏమిటి? నువ్వు చెప్పిన జవాబులు ఏమిటి?"


"సారీ సార్. ఇందాకా అనుకోకుండా ఓ ఇంటర్వ్యూకి వెళ్లాను. ఆయన అడిగిన ప్రశ్నలకు, అప్పుడు నేను జవాబులు చెప్పలేదు. ఇవే ఆ జవాబులు, పొరబాటున మీ ప్రశ్నలకు..." బుర్ర గోక్కుంటూ చెప్పింది అంజు.


"ఔనా? అయినా పరవాలేదు. మీ పాపకు సీట్ కన్ఫర్మ్. ఔనూ.. పాపను ఆ మూన్ మూన్ స్కూల్ నుంచి ఎందుకు మారుస్తున్నారు?"


"సార్. ఈమధ్య అక్కడికి తారాదేవి అని ఓ కొత్త ప్రిన్సిపాల్  వచ్చింది. ఆవిడ వచ్చిన తరువాత ఆ స్కూల్ పూర్తిగా నాశనం అయిపోయింది"


"ఔనా? మీరు వెళ్లండి. ఏ విషయం మీకు మెసేజ్ చేస్తాం" చెప్పాడు చంద్రశేఖర్.


     **     **     **     **


ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తతో

"ఏమండీ! మన నక్షత్రకు ఆ కొత్త స్కూల్ వాళ్లు కానీ  పాత స్కూల్ వాళ్లు కానీ థర్డ్ క్లాసులో అడ్మిషన్ ఇవ్వరట. ఇప్పుడే మెసేజ్ వచ్చింది" చెప్పింది అంజు.


"ఎందుకలా?" అడిగిన భర్తతో పొద్దున్న జరిగిన వ్యవహారం అంతా చెప్పి, "ఆ తారాదేవి ఎవరో కాదు, ఈ చంద్రశేఖర్ భార్యట" అసలు విషయం చెప్పింది అంజు.


"ఔనా? పోతే పోనీ. ఇంకో స్కూల్ ట్రైచేద్దాం. ప్రయత్నం మానకు. ఇంకో పరీక్షకు సిద్ధమవ్వు అంజూ!" చెబుతున్న భర్త వంక వెర్రిగా చూస్తూ ఉండి పోయింది అంజు.


        **     **శుభం*     ***

Thursday 22 February 2024

 

ఆనంద సృష్టి




ప్రభాత గుళిక



ఆనంద సృష్టి


"పువ్వులను మనం సృష్టించలేం. వాటికవే పుష్పించి, వికసించి అందరికీ ఆనందం కలగజేస్తాయి. నవ్వులను మనం సృష్టించుకోగలం. ఆ నవ్వుల్లో మునిగి ఆనంద డోలికల్లో తేలియాడగలం. కొన్ని మన చేతుల్లో ఉంటాయి. పెద్ద పనుల్ని మనం చెయ్యలేకపోయినా చిన్నచిన్న పనులను పెద్ద హృదయంతో చెయ్యాలి. గొప్ప పనులు చెయ్యలేకపోతున్నామని బాధ పడకూడదు. ఆ సందర్భం వస్తే అనుకోకుండా అద్భుతమైన పనుల్లో మనం భాగస్వాములమవుతాం.


"ఆనందం..."

మనం చేస్తున్నది చిన్నపనా పెద్దపనా అని కొలతలు వెయ్యదు. ఎంతగా మనసు పెట్టి, హృదయపూర్వకంగా పసివాడిలా ఆ పని చేస్తున్నామా అని చూస్తుంది. 


ఆనందానికి మనం చిరునామా అయిపోవాలి.


 బాధలు కిటికీ తెరలు. 


మహాద్వారం మన అంతులేని సంతోషమే.


 దాన్ని నిలబెట్టుకోవాలి. ఆ గృహంలో నిత్యం గంతులు వేస్తూ ఉత్సవం. చేసుకోవాలి. చెట్టును, పిట్టను, కొంగను, కోడిని చూసి కూడా మురిసిపోవాలి.  ప్రతీ దృశ్యం సూర్యోదయంలా ఉండదు. ప్రతి సందర్భం పడమట సంధ్యారాగంలా సంగీతాన్ని ఆలపించదు. 


చేతిలో చిన్న వెదురుముక్క కూడా, నాలుగు రంధ్రాల్లో చక్కటి వేణుగానం వినిపిస్తుంది. 


హృదయంలో సంతోషం సంతకాలుండాలి.


*మనసులో మంచి

జ్ఞాపకాల మంచు కురుస్తూ ఉండాలి* 


ప్రేమ లేకుండా మనిషిని భగవంతుడు సృష్టించలేదు. ఆనందం లేకుండా అతడిని జీవించమని చెప్పలేదు.


మనిషి ఆనందిస్తుంటే మురిసిపోయేవాడు ఆ దేవదేవుడే.


ఉదయం లేవగానే రెండే రెండు అవకాశాలు మన ముందుంటాయి. 


రోజంతా సంతోషంగా ఉండాలా, లేదంటే వేదనతో కాలం గడపాలా అని. 


ఆనందం మన హక్కు ఆనందంగా ఉండటం మన స్వభావం. పుట్టుకతో బాధలు అందరికీ ఉండవు. మధ్యలో వచ్చేవి మధ్యలోనే పోతాయి. ఆనందాన్ని సృష్టించు. అపరిమితంగా సృష్టించు.


 గడ్డిపువ్వుల్లోనూ మానస సరోవర బ్రహ్మకమలాన్ని చూడగలిగే మనసును తయారుచేసుకోవాలి.


 బతకడానికి సిరులు-సంపదలు కాదు కావాల్సింది. పెద్ద హృదయంలో చిన్ని చిన్ని ఆనందాలు సృష్టించుకోవడం తెలిసిన నేర్పరితనం కావాలి.


 బృందావనంలో ప్రవేశించినంతనే శ్రీకృష్ణ దర్శనం కాదు. కాని, బృందావన దర్శనం అవుతుంది. అది పరమాత్మ తిరిగిన ప్రదేశం. ప్రతి మొక్క, ప్రతి పూవు, గాలి, నీరు మాట్లాడతాయి. మనసును తెరచి ఉంచుకోవాలి. అంతే!


 'మనలోపల శ్రీకృష్ణుడు వ్యాపిస్తే, కళ్లకు విశ్వమంతా కృష్ణమయంగా అనిపిస్తుంది. ఇదే భావంతో దైవాన్ని మనం లోపల సృష్టించకపోతే బాహ్యప్రపంచంలో ఆయన ఎలా కనిపిస్తాడు... నిత్య సంతోషికి దూరంగా దేవుడు ఉండగలడా? కొంత సంతోషం ఇతరుల మీద చల్లగలిగితే మనకు అది రెట్టింపై తిరిగి వస్తుందిజీవితాంతం నవ్వుతూ ఉండటం జీవన రహస్యం తెలిసినవాడికి మాత్రమే సాధ్యమవుతుంది. అతడే జ్ఞాని, అతడే తనకు చాలా ఇష్టమైనవాడు అంటాడు గీతాచార్యుడు. 


బాధలు, బాధ్యతలు అందరికీ ఉంటాయి. ప్రపంచం భూతంలాగా కనిపిస్తుంది. సంసారం సముద్రంలాగా అనిపిస్తుంది. వైరాగ్యంతో మనసు చేదెక్కిపోయి ఉంటుంది. అక్కడే మనిషి తన భావాన్ని మార్చుకుని చిరునవ్వు నవ్వగలిగి ఉండాలివెంటనే మరిచిపోయి, కళ్లు తుడుచుకున్న చిన్నపిల్లాడిలాగా జీవితాన్ని ఆహ్వానించాలి. ప్రపంచాన్ని కౌగిలించుకోవాలి. నవ్వుతూ అందరినీ పలకరించాలి.


💐🍫💞💞🍫💐

  ఒకనాడొక చర్చలో 'జీవితం అంటే ఏమిటి?' అన్న విషయం మొదలైంది. అక్కడున్న వాళ్ళందరూ రకరకాలుగా వారికి తోచిన విధంగా చెప్పారు. నేనన్నాను - &...